Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

వేదవ్యాసులు - ఆదిశంకరులు

మన మతానికి మూలము వేదము. ఒక విధంగా చూస్తే మన మతాన్ని హిందూమతము అనుటకూడా సరికాదు. సింధునదీ తీరంలో ఉన్నవారి మతానికి పాశ్చాత్యులు పెట్టిన పేరు హిందూమతం. అందుచే మన మతాన్ని వైదికమతమనుటసరి. దీనిని సనాతనధర్మమని కూడా చెప్పుతున్నారు. అన్ని మతములకు ఒక ప్రవక్తో, మూలగురువో ఉండును. కాని మనమతమునకు చారిత్రకముగా ఒక ప్రవక్తలేడు. ఇది ఎన్నియో శతాబ్దములుగ అనాదిగ వచ్చుచున్నది. వేదములెట్లు అనాదిగా నున్నవో ఈ మతమున్నూ అనాదియే.

వేదములు అనంతములు. 'అనంతావై వేదాః' వేద వ్యాసులు తమశిష్యులైన పైల జైమిని, సుమంత, వైశంపాయనుల సాహాయ్యముతో వేదములను నాలుగు భాగములుగా విభజించిరి. వేదములు మంత్రములు. ఇవి వ్రాయబడలేదు. ఒకరు చెప్పగా, ఒకరు వినుచు వల్లన వేయబడుచు వచ్చు చున్నవి. (వాక్కుద్వారా ఒకరినుండి యొకరికి బోధింపబడినవి.) అందుచేతనే వీనికి శ్రుతులనిపేరు. శ్రుతి యనగా వినబడునదని అర్థము. వేదములను విని వల్లించుటకే అధ్యయనమని పేరు. వేదాధ్యయనమును సక్రమముగా చేసిన ఆమంత్రశక్తిచే ప్రపంచమే బాగుపడును. ఇట్లు వేదాధ్యయనమును చేసిన ఋషుల మూలమునుండియే మనము జన్మించితిమని చెప్పుదురు. అందుచే అట్టి గొప్ప ఋషుల వారసులమగు మనకు వేదాధ్యయనము చేయుట ఒకవిధి.

ఋషులు మంత్రద్రష్టులు. అనగా మంత్రములను వారు దర్శించిరని యర్థము. శబ్దము అనాది. రేడియోను ట్యూను చేసి పాటలను విందుము. ఋషులు తమ మనస్సులను యోగ మార్గమున ట్యూన్‌చేసి శ్రోత్రేంద్రియముల కతీతములగు అనాది శబ్దములను గ్రహించిరి. కృష్ణపరమాత్మ తన విశ్వరూపమును చూచుటకు సమర్థములగు దివ్యచక్షవులను అర్జునునకు ప్రసాదించెనట. మన దేహమునగల కొన్ని నాడీవర్గములచేత ఇట్టి శక్తిని పొందవచ్చునని యోగశాస్త్రము చెప్పును.

వేదములను వాని సహజశక్తిలో నుంచుటకు కొన్ని నియమములను ఏర్పరచిరి. మంత్రశక్తిని అవిచ్ఛిన్నముగా నిలబెట్టుటకు వేదాధ్యయన పరులకు ఉపాకర్మ, గాయత్రీ జపము మొదలగు విధులను నియమించిరి. మంత్రద్రష్టలగు ఋషుల యోగశక్తి ద్వాపరమున క్షీణించునని తెలిసియే వ్యాసులు వేదవిభజన చేసిరి. వ్యాసమహం
ఇదే కాక బ్రహ్మసూత్రములకు వ్యాసభగవానులు గ్రంథకర్త. ఉపనిషత్తులకు మూలమగు పరబ్రహ్మతత్త్వమును, దానిని పొందుమార్గమును ఇవి విశదీకరించును. బ్రహ్మసూత్రములకు శ్రీశంకరులు, శ్రీరామానుజులు, శ్రీమధ్వాచార్యులు - మువ్వురును భాష్యములను వ్రాసిరి. వీరేకాక శ్రీ వల్లభాచార్యులు, శ్రీనింబార్కులు, శ్రీకంఠులు సైతము బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యాతలే. అన్ని సిద్ధాంతములును వ్యాసులకు నివాళులనిచ్చును. వేదధర్మశాస్త్రపరిపాలనా సభా సమ్మేళనములలో వ్యాసుల పటమునుబెట్టి పూజింతురు. ఈ సభయొక్క ఉద్దేశ్యము వేదశాస్త్రజ్ఞానమును, ధర్మశాస్త్రజ్ఞానమును నిలబెట్టుటయే. వేదాధ్యయనమును చేయుటకు వీలులేనిచో కనీసము ఒక రూపాయి చందానైనను ఈ సభకిచ్చి సభ్యుడుగా నుండుట కర్తవ్యము. తమ కౌమార, ¸°వన దశలను వేదాధ్యయనమునకై వెచ్చించినవారికి జనము ఋణపడియున్నది. వేదాంతమార్గము నవలంబించే వివిధ శాఖీయులు కూడా ఈ సభలో సభ్యులై వేదవ్యాసులను పూజింపదగును.

ఆధ్యాత్మిక విషయమున విదేశీయులు మనదేశముపై కడు గౌరవభావ ముంచియున్నారు. ఈ అనాది సత్యమును తెలిసికొనుటకు వారు యాత్రికులై వచ్చుచున్నారు. ఈనాడు మనకు గౌరవమున్నదనిన, మన పెద్దలు మన కనుగ్రహించిన వేదముల ఫలితమే. మన మతము వైదికభూమికపై నిలిచియున్నది. కనుక వేదములను విధిగా మనము నేర్వవలెను. వైదికాచారములను చక్కగా తెలిసికొనుటకు వేదాంగములు ప్రయోజన పడుటయేకాక వేదప్రాముఖ్యమును స్ఫుటముగా అవి చాటుచున్నవి. వేదమునకు కర్మానుష్ఠానము అతి ముఖ్యము. మతమునిలువవలెనన్న మతాచారములను పాటించవలెను. వానిని ధర్మశాస్త్రములు విశదీకరించును. అవియే మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి. పరాశరస్మృతి - వీని ననుసరించి నిర్ణయ సింధు, మితాక్షరము అనెడు గ్రంథములును వెలువడినవి. ఇవి అందరును చదువుటకు అందుబాటుగా నున్నవి.

వేదమతమునకునూ, ఇతరమతములకునూ ఒక ముఖ్య భేదముగలదు. వైదికమతమునవలంబించే మనము దేవతలకునూ, పితరులకును చేయవలసిన విధులను నిర్వర్తించవలెను. మనకు దేవలోకమున్నదనుట ఒక దృఢనమ్మకము. అందుచే మతకర్మలలో దేవతలకు ఆహుతుల నిచ్చి ప్రీతినొందించిన వారు వం్షాతపాదులగు సృష్టిసంపదలను సమృద్ధిగా నొసగుదురని భావము. మనకంటెను దేవతలకుశక్తియు బుద్ధికుశలతయు నధికము. పరతత్త్వము ఒక్కటే అయినప్పటికిని దేవతలను విధ్యుక్తముగా ప్రార్థించి వారి అనుగ్రహము పొందుట మనుజుల మగు మనకు కర్తవ్యము. గీతయందు భగవానులన్నారు.

దేవాన్‌ భావయ తానేన తే దేవా భావయంతు వః!

పరస్పరం భావయంతః శ్రేయః పర మవాస్స్యధ!

''ఈ యజ్ఞములచే మీరు దేవతలను ప్రీతినొందింపుడు. ఆ దేవతలు మీకు వం్షాదుల నొసంగి సంతోషమును కూర్తురు. ఇట్లు పరస్పర ప్రేమచే మీరు పరమ శ్రేయస్సును పొందగలరు'' సన్యాసులు మాత్రము. ఈ విధులులేక పరబ్రహ్మోపాసనకు చేయవచ్చును. తదితరులకు దేవ పితృ యజ్ఞములు చేయుట విధి. వానిచే దేవతలు ప్రీతినొందుదురు. పితృ తృప్తిచే వారి నుండి ఏర్పడినటువంటి ఇప్పుడున్న సంతానమేకాక, మరియు కలుగబోవు సంతానము కూడ శ్రేయస్సునొందును. దేవపితృ కార్యములకు యజ్ఞోపవీతధారణము, శిఖ అవసరము. దేవకార్యములను చేయునపుడు శిఖను ముడివైచి, యజ్ఞోపవీతమును ఎడమభుజముపై నుండునట్లుంచుకొనవలెను. పితృ కార్యములకు శిఖను విప్పి, కుడిభుజముపై యజ్ఞోపవీతముండు నట్లుంచుకొనవలెను. శిఖయు, యజ్ఞోపవీతము లేక ఈ కార్యములను చేయరాదు. బ్రాహ్మణతరులు కూడా వివాహసమయములందును, దహన సంచయనాది దినములలోనూ ఉపవీతములను ధరింతురు.

అగ్నియందు వ్రేల్చిన ఆహుతులు దేవునకు చేరునాయనెడు విషయమున సందేహములేదు. దేవుడు అంతర్యామి ఆయన ఎందునూగలడు. అగ్నిలో వ్రేల్చిన ఆహుతులతో ఆయన తృప్తినొందును. గ్రామమున రాజునకు చెల్లింపవలసిన పన్నును గ్రామస్థుడు రాజునకు స్వయముగా నందించుటలేదు. పన్నును గ్రామపుతలారికి ఇచ్చిన అతడు రాజునకు అందజేయును. అటులే సమస్త దేవతలకును చేయు అప్పనములన్నియు పరమేశ్వరునకు చెల్లుచున్నవి. ఆ సర్వేశ్వరుని ప్రభుత్వము అట్టిది. ఆ ప్రభుత్వపు చట్టములే వేదములు. వానివిభజనమే వ్యాసులవా రొనర్చినది. వ్యాసమహం


Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page